Friday, July 4, 2014

ఏటీఎం రసీదులతో జాగ్రత్త (facebook నుంచి సేకరించింది )


ఢిల్లీ : ఏటీఎం యంత్రాల ద్వారా సొమ్ము తీసుకున్న తరువాత ఆ యంత్రం నుంచి వచ్చే రసీదును చాలా మంది భద్రంగా దాస్తుంటారు. మాల్స్‌, షోరూమ్‌లలో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రసీదులను పర్సులో జాగ్రత్తగా భద్రపరుస్తుండటం తెలిసిందే. మరికొందరు పెట్రోల్‌ బంకులు, బస్సుల్లో ఇచ్చే రసీదులను ఇంటి వద్ద పిల్లలకు ఆడుకునేందుకు ఇస్తుంటారు. కానీ ప్రింట్‌ చేయడానికి ఉపయోగించే ఈ రసీదులపై వేసే కోటింగ్‌లో నష్టం కలిగించే రసాయన పదార్ధాలు ఉంటాయి. వీటిలో బయోస్ఫినాల్‌-ఎ (బీపీఏ) అనే పేరుగల రసాయనం కలిసి ఉంటుంది. ఈ విషయంపై డాక్టర్‌ డి.కె.దాస్‌ మాట్లాడుతూ ఏళ్ల తరబడి బీపీఏను అనేక ఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారని, ప్రత్యేకించి గాలి చొరని డబ్బాలు, క్రీడా సామగ్రి తయారీల్లో, సీడీ, డీవీడీ, వాటర్‌ పైప్‌ల లీకేజీ సరిచేసేందుకు, తినే ఆహార పదార్ధాల తయారీ ప్యాకెట్లపై కోటింగ్‌ వేసేందుకు ఉపయోగిస్తుంటారని తెలిపారు. ఆ కారణంగానే విదేశాల్లో పాల సీసాలను తయారు చేసే సంస్థలు దీనిని ఉపయోగించరాదని ఎప్పుడో నిషేధించినట్లు దాస్‌ పేర్కొన్నారు.
ఇటీవల మహారాష్ట్రలోని డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మరాట్వాడా యూనివర్సిటీలో జరిపిన పరిశోధనల ప్రకారం ఈ కాగితంపై వేసే రసాయన కోటింగ్‌ మానవ శరీరానికి చాలా ప్రమాదం కలిగించే అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ రసీదులపై ఏదైనా ప్రింట్‌ చేయడానికి థర్మల్‌ ప్రింటర్లను ఉపయోగిస్తుంటారని, వీలైనంత వరకూ ఈ రసీదులకు దూరంగా ఉండటమే మంచిదని చెప్పారు. లేని పక్షంలో నిరంతరం వీటిని తాకుతూ ఉండటం వల్ల సైడ్‌ ఎఫెక్ట్‌లతో రోగాల బారిన పడే ప్రమాదం లేకపోలేదని తెలిపారు. ఈ సందర్భంగా బీఎల్‌కే సూపర్‌ స్పెషాలిటీస్‌ హాస్పిటల్‌కు చెందిన వైద్యులు డాక్టర్‌ ఆర్‌.కె. సింఘాల్‌ మాట్లాడుతూ ఈ కాగితాలపై వేసే కోటింగ్‌లో ట్రైరీల్‌ మిథేన్‌ థాలిడ్‌కు చెందిన ల్యూకోడై, బీపీఏ, బయోస్ఫినాల్‌-బి స్టెబిలైజర్స్‌ ఉపయోగిస్తారని చెప్పారు. ప్రస్తుతం ఈ కాగితాలను ఎక్కువగా ఏటీఎం, ఇతర మాల్స్‌, షోరూమ్‌లలో ఉపయోగించే థర్మల్‌ ప్రింటర్లలోని పేపర్లపై కోటింగ్‌ కోసం ఈ బీపీఏను అత్యధికంగా వినియోగిస్తున్నారని ఆయన తెలిపారు.
శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందంటే.. పరిశోధనల ప్రకారం ఈ కాగితాలను ఐదు సెకన్ల పాటు చేతిలో ఉంచుకుంటే చాలు 1 మైక్రోగ్రామ్‌ బీపీఏ వేళ్లకు అంటుకుంటుందని, అలాంటిది నిరంతరం పది గంటల పాటు ఈ కాగితాన్ని చేతితో తాకుతూ ఉంటే 71 మైక్రోగ్రాముల బీపీఏ శరీరంలోకి చేరిపోయే అవకాశం ఉందని సింఘాల్‌ అన్నారు. ఈ రసీదులను పర్సులో ఉంచుకుంటే చేతులకు తగిలి ఆ విషపూరిత రసాయనం ఏదో విధంగా శరీరంలోకి చేరే ప్రమాదం ఉందని ఆయన వివరించారు.
ప్రమాదం ఏమిటి?... ఈ బీపీఏ ఈస్ట్రోజెన్‌ మాదిరిగా పనిచేస్తుంది. గర్భిణీలు దీనిని నిరంతరం ఉపయోగిస్తే వారి రక్తంలో కలిసిపోయి ప్లాసెంటా వరకూ చేరి గర్భంలో పెరుగుతున్న శిశువుకు ప్రమాదకరంగా మారుతుంది. ఈ రసీదులు చిన్న పిల్లలకు అందితే ఇది వారి లివర్‌పై చెడు ప్రభావం చూపుతుందని డాక్టర్‌ సింఘాల్‌ చెప్పారు.
దీనిని గుర్తించడం ఎలా?... డాక్టర్‌ డి.కె. దాస్‌ ప్రకారం.. బేబీ ఫీడింగ్‌ బాటిల్స్‌లో ఈ బీపీఏ ఉపయోగించడం లేదని, కానీ ప్రజలు కాస్తంత జాగ్రత్తగా ఉంటే ఆ బాటిల్‌ బీపీఏ కలిగి ఉందా లేదా అనే విషయాన్ని సులువుగా గుర్తించవచ్చని అన్నారు. ఆ మేరకు ప్రతి సీసా వెనుక భాగంలో ఒక త్రికోణం ఉంటుందని దానిలోపల డిజిట్‌ 1 అని దాని కింద పెట్‌ రాసి ఉంటే ఆ బాటిల్‌ బీపీఏ రహితమైందిగా గుర్తించవచ్చన్నారు. ఇదే త్రికోణంలో 07 అని దాని కింద పి ఎల్‌ అని ఉంటే ఆ సీసాలో బీపీఏ ఉంటుందని గుర్తించాలని సూచించారు. డాక్టర్‌ సింఘాల్‌ మాట్లాడుతూ ఈ బీపీఏ అనే రసాయనం ఎప్పటికీ నిలిచే ఉంటుందని దీంతో ఇది పర్యావరణానికి నష్టం కలిగిస్తుందన్నారు. ఈ కాగితాలను కాల్చివేసినా అందులోని రసాయనం మాత్రం చెక్కు చెదరదని అంటూ నిజానికి మన దేశంలో దీనిని వదిలించుకునే విధానాలే అందుబాటులో లేవని అన్నారు. దీని గురించి భయపడాల్సిన పనిలేదని, ఇలాంటి రసాయనాలు ఉంటాయనే వాటికి దూరంగా ఉండటమే అన్ని విధాలా శ్రేయస్కరమని ఆయన చెప్పారు.

No comments:

Post a Comment